హైదరాబాద్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. కార్మిక సంఘాల నాయకులు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ, కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో మంత్రులు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చర్చలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి సంఘం నుండి సుమారు 30 మంది ప్రతినిధులు 14 గంటల పాటు సమగ్రంగా చర్చించి, అందరి ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయాలకు వచ్చారని మంత్రి తెలిపారు. మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోకి, మూడు అంశాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు పొన్నం ప్రభాకర్ . యాజమాన్యం పరిధిలోని 29 అంశాలను పరిష్కరించడానికి కమిటీ ద్వారా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ పరిధిలోని మూడు కీలక అంశాలు ఇలా ఉన్నాయని అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆర్టీసీ గుర్తింపు పొందిన సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఉన్నాయన్నారు. ఇక పీఆర్సీకి సంబంధించి, జూలై నెల జీతాల నుండి 11 శాతం పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిందని పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ గుర్తింపు పొందిన సంఘాల ఎన్నికలేనని, ఇప్పుడు ప్రజలను , కార్మికులను తప్పుదోవ పట్టించేలా వారు తమ వైఖరిని మార్చుకోవడం సరికాదని ఆయన అన్నారు. విలీనానికి సంబంధించి, విధానాలను రూపొందించే కమిటీలలో కార్మిక ప్రతినిధులను తప్పనిసరిగా చేర్చాలని కార్మికులు సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారని మంత్రి తెలిపారు.
అయితే, ఆ కమిటీలలో ఉండే కార్మిక నాయకులు గుర్తింపు పొందిన సంఘాల నుండే ఉండాలనే ఉద్దేశంతో, ముందుగా గుర్తింపు పొందిన సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం అందరి సమక్షంలోనే తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించిందని తెలిపారు. త్వరలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు.


















