అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజతో కీలక సమీక్ష చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ప్రతి గ్రామ పంచాయతీ ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల. బ్లీచింగ్ పౌడర్ , క్లోరిన్ మాత్రల నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఘన వ్యర్థాల (చెత్త) సరైన నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా ఆయన సూచించారు . రోజువారీ చెత్త సేకరణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ‘ఫ్రైడే-డ్రై డే’ (శుక్రవారం-పొడి దినం) కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు, వర్షపు నీరు లేదా మురుగునీరు నిల్వ ఉండకుండా అధికారులు గ్రామాలను తనిఖీ చేయాలని సూచించారు. దోమల సంఖ్య పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని కూడా స్పష్టం చేశారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు , మైక్ ప్రకటనలను వినియోగించు కోవాలని సూచించారు. అలాగే, తాగునీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని, పైప్లైన్లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


















