న్యూఢిల్లీ : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి భారత్- ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తామన్నారు. ఈ ఒప్పందం 2027 ఫిబ్రవరి-మార్చి నుండి అమలులోకి రానుందని చెప్పారు. దీని కింద దాదాపు 93 శాతం భారతీయ ఎగుమతులు 27 దేశాల కూటమికి ఎటువంటి సుంకం (పన్ను) లేకుండా ప్రవేశం పొందుతాయి. వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం మాట్లాడారు. భారత్ తో పాటు 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్ డిసెంబర్ నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న, ‘అత్యంత కీలకమైన ఒప్పందం కోసం చర్చలు పూర్తయినట్లు భారత్ , ఈయు ప్రకటించాయి. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన సమావేశంలో గోయల్ పాల్గొన్నారు.
ఇప్పుడు దాదాపు సున్నా సుంకంతో, యూరోపియన్ మార్కెట్ మొత్తం మనకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఈయుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబర్ నాటికి కుదురుతుంది అని తెలిపారు. ఫిబ్రవరి-మార్చి నాటికి అమల్లోకి వస్తుంది అని అన్నారు. అలాగే, తనతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరపడానికి అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఈ వారం భారత్‌కు వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 93 శాతం భారతీయ ఎగుమతులు 27 దేశాల కూటమికి సుంకం రహిత ప్రవేశాన్ని పొందుతాయని చెప్పారు పీయూష్ గోయల్.


















