అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గురువారం ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను మంత్రి లోకేష్ అభినందించారు. కడప మోడల్ లో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పీటీఎం నాటికి పూర్తిస్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 430 కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న 1,06,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. కేజీబీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ , కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటుచేయాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే 2,03,430 మంది విద్యార్థులకు కూడా కిట్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసరమైన నిబంధనలను తొలగించాలని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో నిర్ణయించిన ఫీజులను స్కూళ్ల వెలుపల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్ లో పొందుపర్చాలని అన్నారు. రాష్ట్రంలోని అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు అందేలా పక్కా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం పిల్లల గార్డియన్ల వివరాలను కచ్చితంగా సేకరించాలని, ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్‌కు పంపి, అక్కడ నుండి పిల్లలకు అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసి, వారి చదువు పూర్తయిన తర్వాత ఆ సొమ్మును స్వతంత్రంగా వినియోగించుకునేలా ఒక శాశ్వత విధానం ఆలోచన చెయ్యాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటువంటి నిర్ణయం తీసుకోవడం వలన తల్లిదండ్రులు లేని పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా, వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా లభిస్తుందని మంత్రి అన్నారు.

















