అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఎంతో మేలు చేకురుస్తూ వస్తున్న తెలుగు అకాడమీకి సంబంధించి సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.
ఇక నుంచి తెలుగు అకాడమీ ముద్రించే టెక్స్ట్‌బుక్స్ ప్రజలందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చేలా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా విక్రయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలు నేరుగా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని వీలైనంత త్వరగా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచడంతో పాటు వారి హాజరు శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు, మరియు పోలవరం తదితర జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఆయా జిల్లాలలో ఉపాధ్యాయుల లభ్యతను సమీక్షిస్తూ విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పాఠశాల హాజరు 95 శాతానికి తగ్గకుండా పక్కా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

















