తిరుపతి : హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. జూన్ 20 నుండి 24వ తేదీ వరకు జరగనున్న 21వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా సాగింది.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస మణికంఠ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


















