తిరుమల : తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. పరిమిత సంఖ్యలో వసతి గదులు నిర్మిచబడ్డాయి. దీంతో 60వే ల మంది భక్తులకు మించి తిరుమలలో వసతి కేటాయించడానికి వీలుపడదు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు తిరుమలలోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (పద్మనాభ నిలయం), పీఏసీ-5 లలో ఉన్న దాదాపు తొమ్మిది వేల లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి.
తిరుమలలో భక్తులు స్వామి వారికి తలనీలాల సమర్పణ కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో ప్రధాన కల్యాణకట్టతో 11 మినీ కల్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. నిరంతరాయంగా క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. .గత ఐదు రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో అత్యధికంగా మే 16, 17వ తారీఖుల్లో 90 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించు కోవడం జరిగింది. అదేవిధంగా గత ఐదురోజుల్లో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.
అత్యధికంగా మే 18, 19, 20వ తారీఖుల్లో 43 వేలకు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గత ఐదురోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 లక్షలకు పైగా భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించింది టీటీడీ. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్న ప్రసాదాలు, పరిశుభ్రత, వసతి, తలనీలాల సమర్పణ, లడ్డూలు వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడం కోసం టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోంది.



















