తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణరథోత్సవం భక్తి పారవశ్యంలో కన్నుల పండుగగా జరిగింది. దివ్య కాంతులతో మెరిసిన స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయ కటాక్షాలు ప్రసాదించారు. “గోవిందా… గోవిందా…” నామస్మరణల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేషంగా ఆకట్టుకుంది. మంగళ వాయిద్యాలు, వేదఘోషలు, హారతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన స్నపన తిరుమంజనంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో పవిత్ర అభిషేకం నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇంజనీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరో వైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక నుంచి టీటీడీ అనుబంధ ఆలయాలలో విధిగా నిత్యం అన్నదానం చేపట్టాలని సూచించారు.


















