ముంబై : ఐపీఎల్ 2026లో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. వికెట్ కీపర్, బ్యాటర్ గా తను ఈ ఐపీఎల్ లో 2వ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 207 రన్స్ చేసింది. ఇందులో సంజు శాంసన్ ఒక్కడే 101 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. తను కేవలం 54 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 10 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ గెలుపులో కీలక భూమిక పోషించిన సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు శాంసన్.
వాంఖేడే వంటి చారిత్రక మైదానంలో, అందులోనూ ముంబై వంటి అగ్రశ్రేణి జట్టుపై శతకం సాధించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి మిగిల్చిందని చెప్పాడు. తాను బంతిని చక్కగా టైమ్ చేస్తున్నాను, ఆ ఊపును అలాగే కొనసాగించాలని మాత్రమే తాను కోరుకునట్లు తెలిపాడు. తనకు సెంచరీ చేయడం కంటే జట్టు కోసం ఆడటం ముఖ్యమని స్పష్టం చేశాడు. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత, నేను బాధ్యత తీసుకోవాలని నాకు తెలుసు. బ్యాటింగ్ చేయడానికి పిచ్ చాలా అనుకూలంగా ఉందన్నాడు. నేను 15-16వ ఓవర్ వరకు క్రీజులో నిలదొక్కుకుంటే, చివరిలో స్కోరు వేగాన్ని భారీగా పెంచగలనని నేను భావించానని చెప్పాడు సంజు శాంసన్.
సీఎస్కే తరపున సాధించిన ఈ శతకం నాకు ఎంతో ప్రత్యేకం అన్నాడు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో, జట్టు స్కోరుకు నేను నా వంతు సహకారం అందించగ లిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు.

















