చెన్నై : ఓటు విలువైనది ప్రజాస్వామ్యానికి పునాది అని స్పష్టం చేశారు మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ . తమిళనాడులో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసందర్బంగా కమల్ హాసన్ తన కూతురు, నటి శ్రుతి హాసన్ తో కలిసి వచ్చారు పోలింగ్ కేంద్రం వద్దకు. ఎలాంటి హంగు ఆర్భాటం అన్నది లేకుండా ఈఇద్దరూ ఇతర ఓటర్లతో పాటే క్యూలో నిల్చున్నారు. తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే పార్టీ చీఫ్ , అగ్ర నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్, తన తల్లితో పాటు వచ్చి ఓటు వేశారు. ప్రముఖ హాస్య నటుడు వీటివీ గణేష్ ఓటు వేశారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతీ యువకులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు బయటకు రావాలని కోరారు. ఇదే సమయంలో తమిళనాడు రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను టీవీకే విజయ్ పార్టీకి ఓటు వేశానని బహిరంగంగానే ప్రకటించారు. ఆపై విజయ్ రాష్ట్రానికి సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తాజాగా గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ తరుణంలో ఓటు వేసిన అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటుకు ఉన్న శక్తి ఈ దేశంలో ఎవరికీ లేదన్నారు. మనందరం బాగుండాలంటే, మెరుగైన సర్కార్ రావాలంటే ఓటు వేయాలన్నారు.


















