హైదరాబాద్ : భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఐఐటి ముంబైతో జాయింట్ వెంచర్‌లో పని చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఏఎఫ్‌ఆర్‌వై ఇండియాను డిజైన్ కన్సల్టెంట్‌గా ఖరారు చేసింది. మంత్రి గారు డిజైన్ బృందాన్ని వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలూ పని చేయమని ఆదేశించారు. మనకు వీలైనంత త్వరగా డిజైన్ కావాలి అని ఆయన నొక్కి చెప్పారు, ఎందుకంటే డిజైన్లను సమర్పించిన వెంటనే ఆమోదం కోసం కేంద్ర జల సంఘం (CWC)కి పంపించాల్సి ఉంటుందన్నారు.
కన్సల్టెంట్లు కార్యదర్శి పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా ఆయన దృష్టికి తీసుకు రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ డిజైన్ ప్రక్రియకు సమగ్రమైన భూభౌతిక, భూ సాంకేతిక, నేల, జల సంబంధ నమూనా , ఇతర అధ్యయనాలు మద్దతుగా ఉంటాయన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటాను అత్యంత ప్రాధాన్యత ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.పరీక్షలు, అధ్యయనాల బాధ్యతను అప్పగించిన భారత ప్రభుత్వ సంస్థ అయిన పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)ను, కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
భారత ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు పొందడానికి సీడబ్ల్యూసీతో సమన్వయం చేసుకోవాలని ఆయన ప్రభుత్వ సలహాదారు యోగి ఆదిత్యనాథ్ దాస్‌ను కోరారు. 45 రోజుల పరీక్షల గడువు పూర్తయ్యే వరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ సిబ్బంది నిరంతరం సైట్లలోనే ఉండాలని స్పష్టం చేశారు.
















