అమరావతి : ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లో రెండు వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు అవుతున్న 1ఎస్, 1 క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.
దేశీయంగా తయారైన ఈ క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది. మేధాటవర్స్ లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్ లు క్వాంటం హార్డ్ వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ లు క్వాంటం ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగ పడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్సు ఫెసిలిటీని ఏర్పాటు చేశారు.

















