హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది ఆర్టీసీ ఉద్యోగులకు. కరువు భత్యాన్ని ప్రకటించింది. ఈ ఏడాదిలో సంస్థ ఉద్యోగులకు జనవరిలో ఇవ్వాల్సిన డీఏను (DA) అందజేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 38 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ అందుతుండగా తాజాగా 2.1 శాతాన్ని పెంచారు. దీనితో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది. ఈ పెంపు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
గత మూడు నెలలకు (జనవరి, ఫిబ్రవరి, మార్చి) సంబంధించిన బకాయిలను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల మేర ఆర్థిక భారం పడనుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న డీఏలను వరుసగా విడుదల చేస్తూ వచ్చామన్నారు. 2024 మే నెలలో RPS-2017 అమలు చేసిన తర్వాత, తాజాగా ఈ 2.1 శాతం డీఏను కూడా మంజూరు చేయడంతో, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలన్నీ పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది జూలై 2025లో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
















