అమారవతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన రైతులకు తీపి కబురు చెప్పారు. రైతులు ఉత్పత్తి చేసిన సేంద్రియ పంటలకు మంచి ధర లభించేలా ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు గ్రామ స్థాయిలోనే రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ట్రాక్టర్లు, డ్రోన్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

















