అమరావతి : అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించడం, ఆ వెంటనే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో జగన్, ఆయన పార్టీ నేతలు సహించలేక పోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. మావిగన్ అంటూ అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కారన్నారు. రాజధానిపై పూటకో మాట, గంటకో మాట ఆడుతుండడంతో ప్రజలు జగన్ పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారన్నారు. అమరావతిపై కుట్రలు పన్నడం తప్పు అని చెప్పడంతో, వైసీపీ బ్యాచ్ సహించలేక పోతోందన్నారు సవిత. మీడియా సంస్థలపైనా, ప్రజలపైనా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందే పోయి, జగన్, ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను, దాడులను చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి సవిత హెచ్చరించారు.
జలధార కార్యక్రమం అనంతరం చెరువు పక్కనే ఉన్న వేరు శనగ పంట భూములను మంత్రి సవిత పరిశీలించారు. ఎంతమేర సాగు చేశారు… పంట దిగుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకొంటున్నారన్నారు. అన్నదాత సుఖీభవ నిధులతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేస్తున్నారన్నారు. రూ.30 వేల కోట్లతో రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నారని, రాయసీమలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు వెచ్చిస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు.
















