ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదంటూ 99 రోజుల ప్రజా పాలన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో నిరసన వ్యక్తం అవుతోంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం తమ సర్కార్ కు ఢోకా లేదంటున్నారు. తాజాగా ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని, దుమ్ము రేపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులతో మాట్లాడటం ఆనందంగా అనిపించిందని అన్నారు. ప్రజల నాడి స్పష్టంగా చెబుతోందని, ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ హవా తప్పదని అనిపిస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి, పేదల,, రైతుల సంక్షేమం, ప్రతి కుటుంబానికి చేరే ప్రభుత్వ పథకాలే మా బలం అని అన్నారు .తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. రేపు వీచే కాంగ్రెస్ గాలిలో ప్రజా వ్యతిరేక రాజకీయాలు తుడిచిపెట్టుకు పోతాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. వారిని జనం నమ్మడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ జెండా మరింత ఎగర బోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్ .

















