అస్సాం : సీఎం హిమంత బిశ్వా శర్మ సారథ్యంలోని బీజేపీ సర్కార్ అరాచక పాలన చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. లేక పోతే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ఆదివారం అస్సాంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. అస్సాం కు ఘనమైన చరిత్ర ఉందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ ప్రాంతంలో మనుషుల మధ్య విభేదాలను సృష్టించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బీజేపీకి ఈసారి తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ.
అమర ప్రజా గాయకుడు జుబీన్ గార్గ్లాగే ప్రజలను ఏకం చేయడానికి కాంగ్రెస్ పని చేస్తుందని చెప్పారు. ఆయన సీఎంను ఏకి పారేశారు. హిమంత బిస్వా శర్మ అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని సంచలన ఆరోపణలు చేశారు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే కాంగ్రెస్ సిద్ధాంతం కూడా జుబీన్ గార్గ్ లాంటిదేనని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. అస్సాంను ఏకం చేయడానికి తన జీవితాంతం కృషి చేసిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు జుబీన్ గార్గ్ అని ప్రశంసించారు. అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సీఎంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

















