అమరావతి : ఏపీ సర్కార్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇప్పటికే 600 హార్స్‌పవర్ సామర్థ్యం గల శక్తివంతమైన బోట్లను రంగంలోకి దించాం అన్నారు. జూన్ 15 నాటికి పూర్తిస్థాయిలో గస్తీని ఏర్పాటు చేసి, ఒక్క తమిళనాడు బోటు కూడా మన జలాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు . జివ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. అక్కడ రక్షణ అవసరాల కోసం బోట్లను తయారు చేసే ‘సాగర్ షిప్పింగ్’ అనే భారీ పరిశ్రమ వస్తోందని తెలిపారు. దీనివల్ల వేల కోట్ల పెట్టుబడులతో పాటు స్థానిక మత్స్యకార యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. హార్బర్‌లో ఉన్న 1900 మీటర్ల జట్టీలో కేవలం 175 మీటర్లు మాత్రమే వారికి కేటాయించాం అని తెలిపారు కొల్లు రవీంద్ర.
మిగిలిన చోట 2000 బోట్లు నిలబెట్టుకునే సౌకర్యం మత్స్యకారులకే ఉంటుందన్నారు. పరిశ్రమలు రావడం, మత్స్యకారుల జీవితాలు మారడం జగన్ రెడ్డికి ఇష్టం లేదా? అని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ తెచ్చిన నల్ల చట్టం జీవో నంబర్ 217ను కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసి మత్స్యకారులకు స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే విధానాన్ని తెచ్చింది కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ. 20,000 సాయాన్ని, ఆయిల్ సబ్సిడీని సకాలంలో అందిస్తున్నాం అని తెలిపారు. పీఎం మత్స్య సంపద యోజన కింద 60% సబ్సిడీతో బోట్లు, వలలు, ఇంజన్లు అందిస్తూ మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచుతున్నాం అన్నారు కొల్లు రవీంద్ర. మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

















