హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వస్త్ర పరిశ్రమ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2047 నాటికి దక్షిణాసియా వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా అవతరించాలనేది తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమ వ్యవస్థను నిర్మించడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఏటెక్స్ కాన్ 2026లో పాల్గొని ప్రసంగించారు. దక్షిణాసియాలో అగ్రగామి వస్త్ర రాజధానిగా అవతరించాలన్నది తమ టార్గెట్ అని పేర్కొన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన 13వ ఆసియా టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణకు ఘనమైన వారసత్వం, చరిత్ర ఉందన్నారు. వస్త్ర పరిశ్రమ రంగంలో ఇప్పటికే పలు రికార్డులు కలిగి ఉన్నదని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీలు, నారాయణపేట చేనేత వంటి ప్రసిద్ధ ఉత్పత్తులతో ఈ రంగం రాష్ట్ర సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకు పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి పత్తి ఉత్పత్తిదారులలో ఒకటని, దాని నాణ్యతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆయన నొక్కి చెప్పారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో సహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
















