అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. తన హయాంలో డయా ఫ్రమ్ వాల్ పూర్తి కావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లను సన్మానించారు. స్వీట్లు తినిపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత టిడిపి ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రం వాల్ ను విధ్వంశం చేసిన చరిత్ర జగన్ సర్కార్ ది అని ఆరోపించారు. గత ఏడాది 2025 జనవరి 18న డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి నేడు పూర్తి చేశామన్నారు.
1372 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ నిర్మాణంను 440 రోజుల్లో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు నిమ్మల రామానాయుడు. జగన్ విధ్వంసానికి కొత్త డయా ప్రం వాల్ నిర్మాణానికి అదనంగా మరో 1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. 2020 ఆగస్టు వరదలకు డయా ఫ్రం వాల్ దెబ్బతింటే 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 జూన్ కు పూర్తి చేస్తానని జగన్ అసెంబ్లీ లో చెప్పాడన్నారు. డయా ఫ్రం వాల్ ఉందొ లేదో తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంశమైన పోలవరం ప్రాజెక్టు పనులను సిఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టారన్నారు నిమ్మల రామానాయుడు. 2027 కల్లా పోలవరం పూర్తి చేసే లక్ష్యం తో డయా ఫ్రం వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు.
















