హైదరాబాద్ : శాసన సభలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూసిందని విమర్శించారు. దళితుడు స్పీకర్‌గా ఉండటం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రావడం లేదని ఆరోపించారు. గతంలో పదవులన్నీ ఒకే కుటుంబానికి దక్కాయని మండిపడ్డారు ప్రస్తుతం తమ ప్రభుత్వంలో భట్టి విక్రమార్క, సీతక్క వంటి దళిత, గిరిజన నేతలకు సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ అహంకారం తోనే సభను బహిష్కరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విన్నవించారు. ఆయన తీరు అసభ్యకరంగా ఉందని, నిబంధనల ప్రకారం ఎథిక్స్ కమిటీ విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారు. దళిత స్పీకర్‌ను అవమానించేలా బిఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

















