అమరావతి : అమరావతిని రాజధానిగా స్థాపించడం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఏపీ అసెంబ్లీలో అమరావతి చట్టబద్ద తీర్మానం సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నో మార్పులు జరిగినప్పటికీ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా స్థిరమైన రాజధాని నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. విభజన అనంతరం ఏర్పడిన సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాల్లో అమరావతి కీలకమని పేర్కొన్నారు. ఇది అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించే కేంద్రంగా మారుతుందని తెలిపారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళాన్ని తట్టుకుని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నామని, అమరావతి ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని మంత్రి తెలిపారు.
సీఎం చంద్రబాబు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా మంత్రి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం ఒక కీలక మలుపు అని, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నిర్ణయం అని మంత్రి పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నుంచి ప్రారంభమైన ప్రయాణంలో కర్నూలు, అనంతరం హైదరాబాద్ రాజధానులుగా మారిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. 2014లో జరిగిన విభజనతో రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి ఆశాకిరణంగా మారిందని అన్నారు. ప్రజలు వివేకంతో తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే అవకాశం కలిగిందని, రాజధాని ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని జిల్లాలకు వనరుగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు.

















