అమరావతి : వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా మేలు చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయింపుల్లో 15 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి మండలి బిల్లు కూడా ఆమోదించిందని తెలిపారు. ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చడంపై హర్షం వ్యక్తంచేశారు. మాటల నిలబెట్టుకున్నందకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.
ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారని, ఆ సమయంలో వడ్డెర సామాజిక వర్గీయులు ఆయన్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారన్నారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకోవడం తమ జీవనోపాధిని, ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే తాము గౌరవప్రదంగా జీవనం సాగిస్తామని మంత్రి లోకేశ్ కు అప్పట్లో వినతి పత్రం అందజేశారు. వడ్డెర సామాజిక వర్గీయులు వినతికి సానుకూలంగా స్పందించిన లోకేశ్, తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని అప్పట్లో భరోసా ఇచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


















