అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదని అన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని తెలిపారు స్పీకర్. అయితే పార్లమెంటులో కూడా బిల్లు పాస్ కావాల్సి ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో ఈ ఆరో సెషన్ జరగనుంది.

















