కోల్ కతా : వేలాది మంది క్రికెట్ అభిమానుల హర్షధ్వానాల మధ్య , తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుంటూ, జట్టులో స్థానం ఉంటుందో లేదో తెలియని సందిగ్ధ స్థితిలో ఎక్కడా తొట్రుపాటుకు గురి కాకుండా ఒంటి చేత్తో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో తను ఒంటరి పోరాటం చేశాడు. ఏకంగా 50 బంతులు మాత్రమే ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్స్ లతో 97 పరుగులు చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఒకానొక దశలో వికెట్లు పడిపోతున్నా ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు శాంసన్.
అంతే కాదు ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డును తను బ్రేక్ చేశాడు. ఈ సందర్బంగా జట్టుకు అద్భుత విజయాన్ని కట్టబెట్టిన సంజు శాంసన్ కు కెప్టెన్ సూర్య కుమార్ తన టోపీ తీసి అభివాదం చేశాడు. తనతో పాటు ఇషాన్ కిషన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ తో పాటు జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం శాంసన్ ను అభినందనలతో ముంచెత్తారు. యావత్ భారత దేశం మొత్తం జట్టు విజయం సాధించడంతో సంబురాలలో మునిగి పోయింది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు సైతం శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశారు.



















