ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతం గంభీర్ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తను ఒంటెద్దు పోకడ పోతుండడం, అసంబద్ద నిర్ణయాలు తీసుకోవడంతో టీమిండియా ఆశించిన మేర ఫలితాలు రాక పోవడం పట్ల కొంత ఆగ్రహంతో ఉన్నట్లు టాక్. ఇదే క్రమంలో గంభీర్ తన పదవీ కాలం త్వరలో ముగియనుంది. దీంతో తనను పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయక పోవడంతో గంభీర్ స్థానంలో ఇతర మాజీ క్రికెటర్లను ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ.
భారత కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఈ ప్రపంచ కప్ చివరిది కాబోతోంది. ఒకవేళ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న టీమిండియా గనుక ఈసారి కూడా ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిస్తే గంభీర్ ను హెడ్ కోచ్ గా కంటిన్యూ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విచిత్రం ఏమిటంటే మొదటి నుంచి గంభీర్ కు తలబిరుసు తనం ఎక్కువ . మైదానంలో సైతం విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. మరో వైపు గంభీర్ ఇటీవలి నిర్ణయాలతో కొంతమంది మేనేజ్మెంట్ సభ్యులు అసంతృప్తితో ఉండటంతో, వీవీఎస్ లక్ష్మణ్ లేదా హర్భజన్ సింగ్ లను హెడ్ కోచ్ కు ఎంపిక చేసే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.



















