అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పాలనా పరంగా మరింత పారదర్శకత అవసరం అన్నారు. సాంకేతికతను ఉపయోగించు కోవాలని సూచించారు. దీని వల్ల సమయం మిగులుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల వారీగా సమీక్షించు కోవాలని స్పష్టం చేశారు, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు
ప్రతీ నెలా 2సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు. ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలని సూచించారు. క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో ఉపకరణాలను కూడా తయారు చేసుకుని ఎగుమతులు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నాం అన్నారు.


















