హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా 420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈసారి గనుక మోసపోతే ఇక జన్మలో మిమ్మల్ని ఎవరూ కాపాడ లేరని అన్నారు. పొద్దున లేస్తే తమపై నోరు పారేసు కోవడం, అబద్దాలు చెప్పడం తప్పితే సీఎంకు వేరే పనేమీ లేదన్నారు. పట్టుమని రెండేళ్ల పాలనా కాలంలో 10 వేల జాబ్స్ కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో రాత పరీక్షలు నిర్వహించిన వాటికే ఫలితాలు ప్రకటించాడని, వాటినే తాము భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు హరీశ్ రావు.
ఇలా చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. 70 వేల జాబ్స్ ఇచ్చానంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగాలు ఇవ్వక పోతే తల నరుక్కుంటానని బహిరంగంగానే అన్నావని, మరి ఇప్పుడు ఎక్కడ నరుక్కుంటావో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి. ఎల్బీ స్టేడియంలో చర్చ పెడతావా లేక అసెంబ్లీలో చర్చ పెడతావా నువ్వే దమ్ముంటే చెప్పాలని అన్నారు. కేసీఆర్ హయంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు పంచి నీ ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని అన్నారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రెండున్నర ఏండ్లైనా పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వ లేదన్నారు.















