హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తన తండ్రిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో, తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు.. తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడిగా పరిగణించాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ‘తిట్ల ట్రాప్’లో పడకండి! మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది ఉందన్నారు. మన వార్డుల్లో మౌలిక వసతుల మీద, రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికీ అందాల్సిన పథకాల మీద ఉండాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి తెలివిగా తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషపు వలలో మనం పడకూడదని హితవు పలికారు. మన చర్చ, మన నిలదీత కేవలం ప్రజల కన్నీటి మీదనే ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాని ఆరు గ్యారంటీల గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆ నమ్మకద్రోహం మీద యుద్ధంలా చర్చను మార్చాలని కోరారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో పడరాని పాట్లు పడిన అన్నదాతల ఆవేదన గురించి, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న రైతన్నల కష్టాల గురించి అడగాలని కోరారు కేటీఆర్. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల మానసిక ఘర్షణకు గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యత ఎవరిదని రేవంత్ రెడ్డిని గల్లా పట్టి అడగాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధుల మనోవేదనకు, డీఏలు లేక, పీఆర్సీ ఊసే లేక నలిగిపోతున్న ఉద్యోగుల ఘర్షణకు గొంతుకగా మీరు నిలవాలని అన్నారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు.
















