హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 2023 జూలైలో కేఎల్ఎస్ఆర్ (KLSR) అనే కంపెనీకి ఏఎస్ఎంఈటీ (ASMET) అనే కంపెనీకి మధ్యలో గొడవ జరిగితే.. ఇద్దరూ NCLATని అప్రోచ్ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు అయితే KLSR అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని NCLAT జడ్జి శరత్ కుమార్ మొబైల్ కి రేవంత్ రెడ్డి మెసేజ్ చేశారని ఆరోపించారు కేటీఆర్. ఈ విషయాన్ని స్వయంగా జడ్జి చెప్పారని అన్నారు.
చివరకు ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, నేను తప్పుకుంటున్నానని ప్రకటించిన విషయం గుర్తు చేశారు. రేవంత్ అండ చూసుకునే ఫోన్ మెసేజ్‌లతో జడ్జి మీద ఒత్తిడి తేవడం వల్లనే జస్టిస్ శరత్ కుమార్ విచారణ నుండి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సంబంధించిన రూ.6 వేల కోట్ల స్కాం బయట పెట్టారు కేటీఆర్. వరుసగా మా అందరిని సిట్ విచారణకు పిలిచినప్పుడే నాకు ఏదో అనుమానం వచ్చిందని అన్నారు మాజీ మంత్రి. మళ్లీ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనిపించిందన్నారు. అందుకని మేము తవ్వడం మొదలు పెడితే.. ముఖ్యమంత్రి బినామీకి చెందిన పెద్ద స్కాం బైట పడిందని చెప్పారు. KLSR ఇన్ఫ్రా అనే ముఖ్యమంత్రి బినామీ కంపెనీ చెందిన రూ 6 వేల కోట్లు స్కాం బాగోతం బైటపడడంతో.. జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపిందన్నారు కేటీఆర్. 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి మీద ఆయన బంధువులు, దగ్గరి వారి మీద ఐటీ రైడ్స్ జరిగాయన్నారు.
సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిదిది.. వాళ్ళు ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదని చెప్పారన్నారు. అప్పుడే KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ రేవంత్ రెడ్డి బినామీది అని తెలిసిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు తిరిగిన TS07FF0009 అనే కారు KLSR ఇన్ఫ్రా టెక్ అనే కంపెనీపై రిజిస్టర్ అయ్యిందన్నారు. రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డికి KLSR ఇన్ఫ్రా, భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీలు పెద్ద ఎత్తున్న డబ్బులు బదిలీ చేశారని ఆరోపించారు. జనవరి 23న దివాళా తీసిన స్థితిలో ఉన్న KLSR INFRA కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందన్నారు కేటీఆర్.నిబంధనలకు విరుద్ధంగా రూ. 6,000 కోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టారో చెప్పాలని నిలదీశారు.


















