అమరావతి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తమ హయాంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగానే పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారని, ఆ విషయం విచారణలో తేలిందన్నారు. ఇందుకు జగన్ రెడ్డి, ఆయన పరివారం బేషరతుగా క్షమాపణలు చెప్పలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. తన చార్జిషీట్‌ను సమర్పించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, నెయ్యి కల్తీ కుంభకోణం రూ. 240 కోట్ల మేర జరిగిందని స్పష్టంగా పేర్కొందని కేశవ్ చెప్పారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు డెయిరీ కంపెనీల నుండి రూ. 4 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించారని మండిపడ్డారు.
పయ్యావుల మీడియాతో మాట్లాడారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసిందని చెప్పారు. నెయ్యి కల్తీ కేసులో తొమ్మిది మంది టీటీడీ అధికారులు, ఐదుగురు డెయిరీ నిపుణులు , ఇతరులతో సహా 36 మందిని నిందితులుగా పేర్కొందని తెలిపారు. ఛార్జిషీట్‌లో డెయిరీ నిపుణులు నెయ్యి తయారీదారులతో కుమ్మక్కయ్యారని పేర్కొంది . దేవస్థానానికి నెయ్యిగా విక్రయించిన అసలు పదార్థం అస్సలు నెయ్యి కాదని, అది రసాయనికంగా శుద్ధి చేసిన పామోలిన్ నూనె, ఇతర పదార్థాలు అని గమనించిందని, ఇదే విషయాన్ని తను సమర్పించిన నివేదికలో వెల్లడించిందని పేర్కొన్నారు పయ్యావుల కేశవ్.

















