విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది పేదలకు, కూలీలకు కడుపు నింపుతున్న , కాంగ్రెస్ సర్కార్ హయాంలో తీసుకు వచ్చిన జాతీయ ఉపాధి హమీ పథకాన్ని నీరు గార్చేలా చట్టాన్ని తీసుకు రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బడా బాబులు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్న కేంద్రం పేదల కడుపు కొట్టేందుకే ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేస్తూ చట్టాన్ని తీసుకు వచ్చిందని ఆరోపించారు షర్మిలా రెడ్డి.
ఇదిలా ఉండగా ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్దరించాలని కేంద్ర సర్కార్ ను డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఆందోళనలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కార్యాచరణ తయారు చేయడం జరిగిందని చెప్పారు ఏపీపీసీసీ చీఫ్. గత 10 ఏళ్లకు పైగా దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. రోజు రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, దీనికి ప్రధాన కారకుడు నరేంద్ర మోదీనేనని సంచలన ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, తిరిగి పాత చట్టాన్ని పునరుద్దరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

















