హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ సందర్బంగా సిట్ పై, కాంగ్రెస్ సర్కార్ పై, సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను డిస్టర్బ్ చేసేందుకే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇస్తే ఎంత మంది కార్యకర్తలు తరలి వచ్చారో అందరు చూశారన్నారు. ఒకవేళ జూబ్లీ హిల్స్ స్టేషన్ కు కేసీఆర్ గనుక వస్తే రాష్ట్రం అగ్ని గుండం కాక తప్పదన్నారు.
అదే కేసీఆర్ కి నోటీసులు ఇస్తే, మున్సిపల్ ఎన్నికలు పక్కన పెట్టి మరీ లక్షలాది మంది కార్యకర్తలు తరలి వస్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు అన్నారు జగదీశ్ రెడ్డి. గతంలో ఎన్నో కమిషన్లు వేశారు అన్నీ కేసీఆర్ నిర్దోషి అనే తేల్చాయని చెప్పారు . ఈ సందర్బంగా ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. అసలు సినిమా వాళ్లు ఎవరైనా వచ్చి తమ ప్రైవసీకి భంగం కలిగిందని ఫిర్యాదు చేశారా? అని నిలదీశారు. సినీ తారల ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేవాళ్లు బీఆర్ఎస్ మీద కక్షతో మాట్లాడుతున్న వాళ్లు మాత్రమే తప్పా మరోటి కాదన్నారు మాజీ మంత్రి.
ఒక దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకునే బండి సంజయ్, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డిలు చేసే ఆరోపణలు తప్ప, సినిమా వాళ్లలో ఏ ఒక్కరైనా వచ్చి తమ ఫోన్ ట్యాప్ అయినట్లు చెప్పారా అంటూ నిప్పులు చెరిగారు.

















