చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో త్వరలో శాసన సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న డీఎంకే మరోసారి పవర్ లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అంతే కాకుండా పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలను ఆకట్టుకునేలా ఇప్పటికే సంక్షేమ పథకాలతో పాటు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అంతే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది.
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు తమిళనాడు శాసన సభ సాక్షిగా. తమిళనాడు జల వనరుల నిర్వహణ అథారిటీ (TNWRMA) ముసాయిదా తో పాటు జిల్లా కమిటీలు , రాష్ట్ర, జిల్లా జల వనరుల నిర్వహణ ప్రణాళికను రూపొందించడానికి వీలు కల్పించే తమిళనాడు జల వనరుల (నియంత్రణ, నిర్వహణ ,పెంపుదల) బిల్లు- 2026 ను ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించి ఈ బిల్లుకు అన్ని పార్టీలకు చెందిన శాసన సభ్యులు ఆమోదం తెలపడం విశేషం.
ఈ చర్యతో, సమగ్ర జల వనరుల నిర్వహణ అథారిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన నమూనా బిల్లును అమలు చేసిన దేశంలోనే తమిళనాడు మొదటి రాష్ట్రంగా అవతరించింది. గ్రామాల నుండి నగరాలకు నీటి భద్రతా ప్రణాళికలను సిద్ధం చేయడం, భూగర్భ జలాలను నిర్వహించడం, వరద మైదాన అభివృద్ధిని నియంత్రించడం ఈ అథారిటీ ముఖ్యమైన బాధ్యత. గత సంవత్సరం నవంబర్‌లో ఈ నమూనా బిల్లును అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేశారు.

















