విజయవాడ : రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాత్ర అలుపెరగని కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల సేకరణలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. మంత్రి నారా లోకేష్ పేరు వింటే జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, భయ భ్రాంతులకు గురి చేసేవారిని ఉక్కు పాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేశ్ జన్మదిన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి సవిత దర్శించుకుని ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేశ్ అవిరళ కృషి చేస్తున్నారన్నారు.
దావోస్ సహా విదేశాల్లో పర్యటిస్తూ ఏపీకి పెట్టుబడులు తీసుకు రావడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో రూ.25 లక్షల కోట్లకుపైగా నిధులు ఏపీకి రాబట్టారన్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రిగా లోకేశ్ సేవలు అభినందినీయమన్నారు. పతనమైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతూ, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఎస్. సవిత. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం, తల్లికి వందనం పథకం అమలు చేసి అందరికీ విద్యను అందజేయడంలో విజయవంతమయ్యారన్నారు. 150కి పైగా కేసులు వేసినా, వాటన్నింటినీ అధిగమించి, మెగా డీఎస్సీ నిర్వహించి, 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఈ ఏడాది మరో డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్నారన్నారు.
















