హైదరాబాద్ : విద్యా రంగానికి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజనీరింగ్, లా, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా యూపీఎస్సీ (సివిల్స్) రాసేవారిని ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన యువతకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు సీఎం. ఇవన్నీ ప్రపంచంతో పోటీ పడాలన్న ఉద్దేశంతో చేస్తున్నామని తెలిపారు. ఎంత ఎదిగినా కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మరవకండి అని కోరారు రేవంత్ రెడ్డి. రేపటి మీ భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉందని అన్నారు.. 25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకోండి. చదువు మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని చెప్పారు.. దేశంలో ఏ మూలకు వెళ్లినా తెలంగాణకు గుర్తింపు, గౌరవం తీసుకు రావాలని కోరారు సీఎం. లక్ష్యాన్ని సాధించి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు జమీందార్లు, జాగీర్దార్ల వద్ద ఉన్న భూములను తీసుకుని భూమిలేని నిరుపేదలకు అసైన్‌మెంట్ లేదా పోడు భూముల పట్టాలను ఇచ్చారని, కానీ నేడు పేదలకు పంచేందుకు ఇప్పుడు భూములు లేవని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే కష్టమైన పనిగా మారిందన్నారు. ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్య మాత్రమేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. విద్య ఒక్కటే మీ జీవితాన్ని మార్చగలదని అన్నారు. అభివృద్ధి చెందిన పౌరులుగా నిలదొక్కు కోగలుగుతారని, అందుకే ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు.















