తిరుపతి జిల్లా : ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొలువై ఉన్న తిరుమల తో పాటు తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక క్రీడలపై సంపూర్ణ నిషేధం విధించినట్లు ప్రకటించారు ఎస్పీ సుబ్బారాయుడు. సంప్రదాయం ముసుగులో జీవ హింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. కోడి పందాలు, జూదం నిర్వహించినా, వాటికి స్థలాలు లేదా పొలాలు కల్పించినా, నిర్వాహకులు, పాల్గొన్న వారందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బృందాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగించడం జరుగుతుందన్నారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో కోడి పందాలు, పేకాట, మట్కా తదితర జూద క్రీడలు నిర్వహించడం, ఆడటం, ఆడించడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహించు కోవాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో శాంతియుతంగా జరుపు కోవాలని జిల్లా ప్రజలకు సూచించారు ఎస్పీ సుబ్బా రాయుడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సంప్రదాయం పేరుతో జీవ హింసకు పాల్పడటం నేరమని, కోడి పందాలు వంటి క్రీడలు జంతు సంక్షేమ చట్టాలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. .















