అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందన్నారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. త్వరితగతిన సాయం అందించాలన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వివరించారు హోం మంత్రి అనిత, ఇతర ఉన్నత అధికారులు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా కీలక సూచనలు చేవారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు అందజేయాలని, పూర్తిగా ఆస్తులు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలని అన్నారు. బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు.

















