హైదరాబాద్ : ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అన్ని వర్గాలకు మేలు చేకూర్చేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వంలో మా ప్రతి ఆలోచన, ప్రతి పథకం మానవీయ కోణంలో ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, నిస్సహాయులైన వృద్ధుల సంక్షేమానికి భరోసా ఇచ్చేలా పథకాల రూపకల్పన చేశామని ప్రకటించారు. మాకు మా ప్రభుత్వం అండగా ఉందన్న నమ్మకం నిస్సహాయులకు కల్పిస్తున్నామని అన్నారు. గత సర్కార్ వీరి గురించి మానవీయ కోణంలో ఆలోచించిన పాపాన పోలేదన్నారు రేవంత్ రెడ్డి. . ఆ క్రమంలోనే ఈ రోజు ప్రజా భవన్ లో రూ.50 కోట్లు కేటాయించి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.
వాళ్లంతా ఈ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పోటీ సమాజంలో ధైర్యంగా నిలదొక్కుకునేలా వారికి విద్య, ఉద్యోగాల భర్తీలో కోటాను కేటాయిస్తున్నాం అని అన్నారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని, ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని, ఇదంతా తన వల్లనే సాధ్యమైందని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రతి దివ్యాంగుడు జైపాల్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు.















