అమరావతి : ప్రపంచంలోనే తెలుగు భాష అద్భుతమైన భాష అని పేర్కొన్నారు రాష్ట్ర భారీ, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం ఏపీలోని గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష ఔనత్యాన్ని, గొప్పదనాన్ని, ఉనికిని చాటి చెప్పడం లో తెలుగు మహాసభలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని ప్రశంసలు కురిపించారు నిమ్మల రామానాయుడు. తెలుగు భాషను, తెలుగు దేశం పార్టీని విడదీయలేమని అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాతే మన అమ్మ భాషకు ప్రపంచ స్దాయి గుర్తింపు తీసుకొచ్చారు దివంగత ప్రజా నాయకుడు, ప్రముక నటుడు అన్న నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు.
తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు తెలుగు వారంటే మద్రాసీలు, సాంబారీలు అనే పిలిచే వారని అన్నారు. దీనినే గుర్తించారు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. దీనిని గమనించి ఏకంగా తెలుగు వారు ప్రతి చోటా ఉండాలని, వారి ఆత్మ గౌరవం మరింత ఇనుమడింప చేసేందుకు ప్రయత్నం చేశారని కొనియాడారు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో దేశంలోనే సంచలనం సృష్టించారు ఎన్టీఆర్ అని అన్నారు. ఇందు కోసం తెలుగు వారి కోసం ప్రపంచాన్ని విస్మయ పరిచేలా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి ఒక్కరేనని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.















