అమరావతి : ఏపీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేందుకు గాను కొత్త సంవత్సరంలో తీపి కబురు చెప్పింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సర్కార్ తరపున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని చెప్పారు. ప్రజలపై ట్రూ ఆప్ చార్జీల భారం పడకుండా దాదాపు రూ. 4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తోందన్నారు. ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు రూ. 13 పైసలు తగ్గింపు లభిస్తుందన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలతో.. ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు బీసీ జనార్దన్ రెడ్డి.
డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్సీకి ప్రభుత్వం లేఖ రాసిందని వెల్లడించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరించింది ఆనాటి జగన్ రెడ్డి సర్కార్. పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులపై నూతన సంవత్సరంలో విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తీసుకుంటున్న సంస్కరణలలో భాగంగా.. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ప్రజలపై పడుతున్న విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని భరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు.















