హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగించే ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025’ ను నిర్ద్వందంగా తిరస్కరించాలని కోరారు. ఆ చట్టాన్ని తరిస్కరించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. విబిజి రామ్ జీ 2025 చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ తీర్మానానికి మద్దతు తెలియజేస్తూ వీబీ-జి రామ్ జీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంత పేదలకు కలిగే నష్టాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని శాసనసభ ద్వారా డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. వికసిత్ బారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల మహిళలు ఉపాధికి హామీ లేకుండా చేస్తుందని వాపోయారు. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే విధంగా కొత్త నిబంధనలు పేదల పట్ల శాపంగా మారనున్నాయని మండిపడ్డారు.
















