హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన చెరువులను పునరుద్దరించే పనిలో పడింది. దీంతో ఆయా చెరువులన్నీ కళ కళ లాడుతున్నాయి. అంతేకాకుండా హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలు అవుతున్నాయి. గతేడాది బతుకమ్మ ఉత్సవాలకు అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వేదికైతే.. కొత్త సంవత్సరంలో కైట్ ఫెస్టివల్‌కు మరి కొన్ని చెరువులు ముస్తాబయ్యాయి. మాధాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్ – ఉద్ – దౌలా చెరువులు ఇప్పుడు కైట్ ఫెస్టివల్‌కు వేదికలయ్యాయి. హైడ్రాతో వచ్చిన మార్పును చూసి నగర ప్రజలు మురిసి పోతున్నారు. ఆక్రమణలకు గురై.. చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువులు హైడ్రా చర్యలతో కొత్తగా కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చి బతుకమ్మకుంటను చెరువును ప్రారంభించడంతో పాటు.. బతుకమ్మ ఉత్సవాలలో కూడా పాల్గొన్నారు. అలా వారం రోజులు బతుకమ్మ ఉత్సవాలతో బతుకమ్మకుంట అలరారింది. ఇప్పుడు హైడ్రా అభివృద్ధి చేసిన మరో మూడు చెరువులు కైట్ ఫెస్టివల్‌కు వేదికగా మారడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చెరువులు 60 శాతం వరకూ కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. మురుగు నీరు కలసి మురికి కూపాలుగా మారాయి. చెరువు పరిసరాలకు వెళ్ళలేని పరిస్థితిని నగర ప్రజలు చూశారు. దోమలు, క్రిములు, కీటకాలతో రోగాలకు కేంద్రాలుగా మారాయి. ఇది హైడ్రా రాక ముందు పరిస్థితి. హైడ్రా వచ్చిన తర్వాత చెరువుల రూపురేఖలు మారాయి. చెరువుల అభివృద్ధి అంటే అందాలద్దడం కాదు.. చెరువుల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడం కూడా ఒక భాగమే అని హైడ్రా రుజువు చేసింది.

















