హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. మూసీ సుందరీకరణకు సంబంధించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుందంటూ ప్రశ్నించారు సర్కార్ ను. ఒకసారి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రూ. లక్ష కోట్లు అన్నారు, ఇంకోసారి రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అన్నారు. ఇలా రోజుకో సంఖ్యలు చెబుతూ ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారంటూ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ కోసం అసలు ఎంత ఖర్చు పెడతారో ప్రభుత్వం చెప్పాలన్నారు.
ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారో , .. కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద కాంపెన్సేషన్ ఇచ్చారా.. లేదా సింపుల్ గా కేసీఆర్ కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు అసైన్‌మెంట్ చేసి పంపారా అంటూ నిప్పులు చెరిగారు హరీశ్ రావు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పద్నాలుగున్నర లక్షల డబ్బు ఇచ్చి, అదే విధంగా 200 గజాల స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. ఆవిధంగా ఇచ్చారా, ఇస్తారా, ఇస్తే ఎంత మందికి ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశ పూర్వకంగా ఒకేసారి తెరిచారు.. దీంతో ఇండ్లు మునిగిపోయి, ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
పైనుండి వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్దిగా నీటిని కిందికి వదలాలి.. కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రాజెక్ట్ నిండే వరకు గేట్లు తెరవలేదన్నారు.















