హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో గ్రామీణ వార్తల ఎడిటర్ గా ప్రసిద్ది చెందిన టి లక్ష్మణ్ రావు నిన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆంధ్రభూమి, ఉదయం, వార్త, సాక్షి తదితర దిన పత్రికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఈ రెండు రాష్ట్రాలలోని గ్రామీణ విలేకరులకు ఆయన చిరపరిచితులు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆదుకునేందుకు ముందుండేవారు. అంతే కాకుండా పాత్రికేయులలోని ప్రతిభను గుర్తించి ఆయా పత్రికల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఎల్లప్పుడు చిరునవ్వుతో అందరిని పలకరించేవారు.
జర్నలిస్ట్ కాలనీ గోపన్న పల్లిలో నివాసం ఉన్నారు. ఆయన పార్థీవ దేహానికి సాక్షి దిన పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వర్దేల్లి మురళీ , ప్రముఖ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి , సతీష్ చందర్ , మీడియా అకాడమి మాజీ చైర్మన్, బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, ప్రముఖ పాత్రికేయులు మల్లె పల్లి లక్ష్మయ్య, రవి కాంత్ రెడ్డి, పున్నా కృష్ణ మూర్తి, జర్నలిస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి కైలాష్ తదితరులు నివాళి అర్పించారు.
మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి దిన పత్రిక మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ , మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్ కట్ట శేఖర్ రెడ్డి , సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరి శంకర్ , ఎంతో మంది జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.


















