తిరుపతి : భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోష్యం చెప్పారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మన దేశం, భారతీయత గురించి చర్చించు కోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందని అన్నారు సీఎం. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత ద్వారా చాటి చెప్పాం అన్నారు.
2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు 150 దేశాలు యోగాను పాటిస్తున్నాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. యోగా పాటిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించడం జరిగిందన్నారు. 2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించిందని చెప్పారు. పూర్వ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మన భారత దేశం అని పేర్కొన్నారు. 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనదన్నారు చంద్రబాబు నాయుడు. జీరోను భారతీయులే కనుగొన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదేనని అన్నారు. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారత దేశం సొంతం. అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారని పేర్కొన్నారు.















