అమరావతి : విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విజయవాడ సుస్థిర, ప్రణాళిక బద్దమైన అభివృద్దికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించాలని కోరారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అత్యవసరమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా అందిచడం జరిగిందన్నారు సీఎంను కలిసిన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో.
దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. నగర పరిసరాల్లోని 74 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయటానికి అవకాశం వుంటుందని చంద్రబాబుకు తెలియ చేశామన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా-కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటో కాల్ ఇబ్బందులకు ఒక పరిష్కారం లభిస్తుందన్నారు.

















