తిరుపతి జిల్లా : తిరుపతి లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని, అదంతా తప్పుడు సమాచారం అని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లాఠీచార్జ్ జరిగిందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. భక్తులను భయాందోళనలకు గురిచేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతా రాహిత్య చర్య అని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఎస్ఎస్డీ దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరిన నేపథ్యంలో, అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తమై భక్తులను శాంతియుతంగా, క్రమబద్ధంగా క్యూలైన్లలోకి పంపించడం మాత్రమే జరిగిందని చెప్పారు. అంతకు మించి లాఠీచార్జ్ చేయలేదని , వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు ఎస్పీ ఎల్ . సుబ్బారాయుడు. భూదేవి క్యూ కాంప్లెక్స్ లో ఎలాంటి తోపులాటలు కానీ, తొక్కిసలాట చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. లాఠీచార్జ్ గానీ బలవంతపు చర్యలు గానీ ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. లాఠీచార్జ్ అంటూ భయాందోళనలు సృష్టించే విధంగా తప్పుడు, అవాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ప్రజలు, భక్తులు వదంతులను నమ్మ వద్దని,అలాగే ధృవీకరించబడిన అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ఎస్పీ కోరారు.



















