తిరుమల : శ్రీవారి భక్తులు దళారులను ఆశ్రయించి మోస పోవద్దని హెచ్చరించింది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) . బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు భక్తులు దర్శనం కోటాకు సంబంధించి కేవలం తాము సూచించిన అధికారిక వెబ్ సైట్ ద్వారానే నమోదు చేసుకోవాలని సూచించింది. సోషల్ మీడియా, అనధికారిక వెబ్‌సైట్లు లేదా మధ్యవర్తుల ద్వారా ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి భక్తులకు సూచించారు. శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవలు , ఇతర సేవలను కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియా వేదికలు, అనధికారిక వెబ్‌సైట్లు లేదా మధ్యవర్తుల ద్వారా జరిగే తప్పుడు ప్రచారాలకు లోనుకావద్దని ఆయన సూచించారు.
నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, అక్రమ మార్గాల్లో డబ్బు వసూలు చేస్తూ కొందరు మోసగాళ్లు భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుంటున్నారని హెచ్చరించిన ఆయన, అటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీవారి దర్శనం, వసతి, సేవా బుకింగ్‌లు, టికెట్ల విడుదల, రద్దయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శన విభాగాల వివరాలు , ప్రస్తుత నిరీక్షణ సమయం (waiting time) వంటి అధికారిక సమాచారమంతా TTD అధికారిక వెబ్‌సైట్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయబడుతుందని ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కూడా భక్తులకు సరైన సమాచారం నిరంతరం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, భక్తులు టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257ను సంప్రదించవచ్చని, అక్కడ పూర్తి , సరైన సమాచారం లభిస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికార వ్యక్తులకు డబ్బు బదిలీ చేయవద్దని , వారి మాటలను నమ్మవద్దని ఆయన భక్తులకు సూచించారు. బుకింగ్‌ల పేరుతో ఎవరైనా మధ్యవర్తులు, ఏజెంట్లు లేదా అనధికార వ్యక్తులు సంప్రదిస్తే, వెంటనే TTD విజిలెన్స్ ఫిర్యాదుల విభాగం (Vigilance Complaint Cell) నంబర్ 9866898630కు సమాచారం అందించాలని కోరారు. అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



















