తిరుపతి జిల్లా : కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. కాపు, దళితులు ఐక్యతకు కృషి చేసిన అరుదైన నాయకుడు అని ప్రశంసించారు. ముద్రగడ పద్మనాభం తనకు మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. చాలా కాలం నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం మచ్చలేని మనిషిగా ప్రజా జీవితాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని ప్రశంసించారు. పదవుల కంటే ప్రజల వైపే నిలిచారని, వారి బతుకుల్లో మంచి మార్పు కోసం కృషి చేసిన ఘనత తనదేనని అన్నారు.
కాపు సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, అలుపెరగని పోరాటం చేశారని అన్నారు చింతా మోహన్. నమ్మిన మాటకు కట్టుబడి, నిబద్ధతతో పనిచేసే స్వభావం ఆయన సొంతమని తెలిపారు. కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. నాతోపాటు రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులు, కాపు నాయకులు , ప్రజా సంఘాల ప్రతినిధులకు తానే స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సభ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నిర్వహించారని చెప్పారు. అలాగే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ని ఆహ్వానించి, మరో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నేను హాజరయ్యాను. కాపు, దళితుల ఐక్యత గురించి ప్రసంగించానని తెలిపారు చింతా మోహన్.
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు.

















